విజేఈఈభవ!
రేపటి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పరీక్ష
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉమ్మడి జిల్లాలో ఐదు కేంద్రాల్లో రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష రాసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా విద్యార్థులు వారి అడ్మిట్ కార్డులో ఉన్న నియమనిబంధనలు ఒకటికి రెండు సార్లు చదువుకోవటం మంచిది. పది మంది పరిశీలకులు పరీక్షను పర్యవేక్షిస్తారు.
– జి. బర్నబాస్, పరీక్షల సమన్వయకర్త
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ –2026కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌ల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గొల్లపూడికి చెందిన లైఫ్‌బ్రిడ్జి ఇన్ఫో టెక్నాలజీస్ (వాసవీ ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్), గవర్నర్‌పేట రామమందిరం రోడ్డులోని ఎస్‌వీటీ ఇన్ఫోటెక్, కండ్రికలోని ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్, కానూరు డొంకరోడ్డులోని శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, కానూరు గ్రామంలోని ఐకాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్ పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పరీక్షకు సుమారుగా 30 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్ష జరుగుతుంది.


