క్రీడాకారులు ఐక్యత, క్రమశిక్షణ చాటాలి
తొలి రోజు మూడు మ్యాచ్‌లు..
గుడివాడరూరల్: క్రమశిక్షణ, ఐక్యతను చాటేలా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 బాలికల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలను గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావ్‌లతో కలసి మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 జట్లు పాల్గొన్నాయి.
ర్యాలీగా క్రీడా ప్రాంగణానికి..
తొలుత ఏలూరు రోడ్డులోని హోమియో కళాశాల నుంచి ఎమ్మెల్యే రాము క్రీడాజ్యోతి, క్రీడాకారులు జాతీయ జెండాలను చేతబూని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి సుభాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ బ్యాండ్ మధ్య మార్చ్‌పాస్ట్ చేస్తూ మంత్రి, ఎమ్మెల్యేలు, అధికార, అనధికార ప్రముఖులకు క్రీడాకారులు గౌరవ వందనం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత తెలంగాణ–నవోదయ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. పోటీలు ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శాప్ చైర్మన్ రవినాయుడు, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్‌వినీల్, మునిసిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, డీఈవో సుబ్బారావు, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి భానుమూర్తి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల క్రీడాధికారులు ఝాన్సీలక్ష్మి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పోటీల్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరగ్గా.. మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, నవోదయ విజ్ఞాన జట్లు తలపడ్డాయి. తెలంగాణ జట్టు 20పాయింట్ల తేడాతో విజయం సాధించింది. 2వ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌పై 4పాయింట్ల తేడాతో గెలిచింది. 3వ మ్యాచ్‌లో తమిళనాడు, జార్ఖండ్‌పై 6పాయింట్ల తేడాతో విజయం సాధించింది.


