హైవేపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఇబ్రహీంపట్నం: సంక్రాంతి పండుగ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ప్రజల వాహనాలతో ఇబ్రహీంపట్నంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. తెలంగాణ వైపు ఈనెల 17నుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. ప్రయాణం ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు–మైలవరం మార్గం మీదుగా మళ్లించామని ఆమె తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. రింగ్ సెంటర్‌లో ట్రాఫిక్ నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సీఐ చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఐ బి. లక్ష్మణరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


