వంశీ అనుచరులకు ముందస్తు బెయిల్ మంజూరు
విజయవాడలీగల్: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ తనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై మాచవరం పోలీసుస్టేషన్‌లో గత డిసెంబరు నెలలో కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితులుగా వున్న అనగాని రవి, మూల్పూరి ప్రభుకాంత్, ఓలుపల్లి రంగా, కాట్రు శేషులకు 12వ అదనపు జిల్లా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీని అరెస్టు చేయకుండా ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు కొమ్మా కోట్లు, తేలప్రోలు రాము రిమాండ్ ఖైదీలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా వారికి కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
కాలువలో యువకుడి మృతదేహం లభ్యం
పెనమలూరు: పెళ్లి ఇష్టం లేదని బందరు కాలువలో దూకి గల్లంతైన షేక్ నాగుల్‌మీరా మృతదేహం పెదపులిపాక గ్రామ పరిధిలో కాలువలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమట దర్శిపేటకు చెందిన షేక్ నాగుల్‌మీరా(23) రాపిడో వాహనం నడుపుతూ జీవిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని ఈ నెల 16వ తేదీన హనుమాన్‌జంక్షన్ వద్ద మడిచర్ల గ్రామానికి వెళ్లారు.అయితే నాగుల్‌మీరాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. దీంతో అదే రోజు అతను యనమలకుదురులో మిత్రుడి వద్దకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని చెప్పి తిరిగి ఇంటికి వెళుతూ పాత పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్న వంతెన వద్ద సెల్‌ఫోన్ బందరు కాలువలో విసిరేసి కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో గాలించారు. పెదపులిపాక గ్రామ పరిధిలో ఆదివారం కాలువలో నాగుల్‌మీరా మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీకాకుళం(ఘంటసాల): ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ ఏకరాతి ప్రసన్న మల్లికార్జున స్వామి ఆలయ పునః నిర్మాణానికి పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన కీ.శే. చెన్నకేశవుల వెంకటేశ్వరరావు – సరస్వతి దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారులు రూ.5 లక్షల విరాళాన్ని సోమవారం కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శివాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. భారీ విరాళం అందించిన చెన్నకేశవుల నాగమల్లేశ్వరరావు – ఉమామహేశ్వరి, చెన్నకేశవుల నాని – సంధ్యారాణి దంపతులను ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), దాసం రామకృష్ణ, కొండవీటి కోటేశ్వరరావు, తమ్మన సోమేశ్వరరావు, మేకా పుల్లయ్య, నవతా రాంబాబు, తమ్మన తాతయ్య, గాజుల సత్యం, గాదె వెంకటేశ్వరరావు తదితరులు దుశ్శాలువాతో సత్కరించారు.
వంశీ అనుచరులకు ముందస్తు బెయిల్ మంజూరు
వంశీ అనుచరులకు ముందస్తు బెయిల్ మంజూరు


