బెల్టు షాపులు మూయించండి
మద్యం తాగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఆడపిల్లలు రహదారులపై తిరగలేకపోతున్నారు స్పందనలో ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
అవనిగడ్డ: కేవలం మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఆరు బెల్టుషాపులు ఉన్నాయని, వీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, బెల్టు షాపులు మూయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అశ్వరావుపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాసినేని శ్రీనివాసరావు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ నుంచి అశ్వరావుపాలెం వెళ్లే రహదారిలో, లంకమ్మ మాన్యం వద్ద ఉన్న బెల్టుషాపుల వల్ల స్కూల్, కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెల్టు షాపు నిర్వాహకులు మద్యం తాగి రోడ్లపై ఇష్టానుసారంగా సంచరిస్తూ ప్రజలను, రహదారిపై వెళ్లే వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని, ఈ విషయమై స్థానిక ఎకై ్సజ్ అధికారులకు పలుసార్లు ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. బెల్టుషాపులు మూయించి నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దాసినేని శ్రీనివాసరావుతో పాటు కొంతమంది టీడీపీ కార్యకర్తలు, స్థానికులు ఫిర్యాదులో సంతకాలు చేశారు. అశ్వరావుపాలెంలో బెల్టుషాపుల గురించి ఏకంగా టీడీపీ గ్రామ కన్వీనర్ దాసినేని శ్రీనివాసరావు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.


