తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేదదీరారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ టౌన్–మైసూర్ (07033) ఫిబ్రవరి రెండు నుంచి అదే నెల 27వ తేదీ వరకు ప్రతి సోమ, శుక్రవారాలు, మైసూర్– కాకినాడ టౌన్ (07034) ఫిబ్రవరి మూడు నుంచి 28 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (07153) ఫిబ్రవరి ఆరు నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం, ఎస్‌ఎంవీటీ బెంగళూరు–నర్సాపూర్ (07154) ఫిబ్రవరి ఏడు నుంచి 28 వరకు ప్రతి శనివారం, హైదరాబాద్–బెలగావి (07043) ఫిబ్రవరి ఐదు నుంచి 12 వరకు ప్రతి గురువారం, బెలగావి– హైదరాబాద్ (07044) ఫిబ్రవరి ఆరు నుంచి 13 వరకు ప్రతి శుక్రవారం, సంత్రగచ్చి– యలహంక (02863) జనవరి 22 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి గురువారం, యలహంక–సంత్రగచ్చి (02864) జనవరి 24 నుంచి 28 వరకు ప్రతి శనివారం, షాలీమార్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (02841) ఫిబ్రవరి రెండు నుంచి 23 వరకు, ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (02842) ఫిబ్రవరి నాలుగు నుంచి 25 వరకు ప్రతి బుధవారం నడవనున్నాయి.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) ఆదివారం ప్రశాంతంగా జరిగినట్లు స్థానిక పరీక్ష సమన్వయకర్త జి. బర్నబాస్ పేర్కొన్నారు. నగరంతో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లోని మూడు కేంద్రాల్లో ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. నగరంలోని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (కొత్తపేట), చిట్టూరి విద్యాలయం (గొల్లపూడి), వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (నున్న) కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఆరో తరగతి ప్రవేశానికి 943 మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా అందులో 796 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశానికి 343 మంది రిజిస్టర్‌గా కాగా అందులో 272 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 84.38 శాతం, తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షకు 79.24 శాతం హాజరైనట్లు బర్నబాస్ తెలిపారు.
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న గోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనాలు, ప్రసాదాల పంపిణీ, రంగుల మహోత్సవ వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి తిరుగు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో రంగుల మహోత్సవాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తహసీల్దార్ మనోహర్, కమిటీ సభ్యులు కాకులపాటి కృష్ణమోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ


