కిక్కిరిసిన బస్టాండ్
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ ప్రయాణికులతో కిట కిటలాడింది. సెలవులు ముగియటంతో తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఆదివారం పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారంలలో పెద్ద సంఖ్యలో రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖ పట్నం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు 680 ప్రత్యేక బస్సులను కేటాయించారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహకులు ప్రయాణికుల అవసరాలను గుర్తించి తమ చేతివాటంను ప్రదర్శిస్తూ సాధారణ రేట్లపై 4నుంచి 5శాతం అదనంగా వసూళ్లు చేస్తుండటంతో ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపారు. హైదరాబాద్ రూట్‌లో నిత్యం ప్రయాణించే బస్సులకు అదనంగా 182, విశాఖపట్నం రూట్‌లో 370, రాయలసీమ ప్రాంతాలకు 128 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


