రాహు కేతు పూజలకు పోటెత్తిన భక్తులు
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రాహుకేతు పూజలు జరిపించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం మౌళి అమావాస్య పురస్కరించుకుని పెదకాకాని శివాలయంలో రాహు కేతు పూజలు భక్తులు అధిక సంఖ్యలో జరిపించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం రాహుకాలం 4.30 గంటల వరకూ 1,276 టికెట్లు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. రాహు కేతు పూజల ద్వారా ఆదివారం రూ.6,38,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు, పాలు, తాగునీరు భక్తులకు అందించినట్లు లీలాకుమార్ తెలిపారు. అలానే ఆదివారం ఆలయంలో అంతరాలయ అభిషేకాలు, అంతరాలయ దర్శనాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు, నవగ్రహ పూజలు అధికసంఖ్యలో జరిగాయి. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


