ఏవి తల్లీ... నాడు వెలిగిన కళాకాంతులు..!
దుర్గమ్మ సన్నిధిలో వెలవెలబోతున్న కళావేదిక
ఏడాది కిందట నిత్యం ప్రదర్శనలు
నేడు ప్రదర్శనలు లేక కళ తప్పిన వేదిక
కళావేదిక తొలగింపునకు తెరవెనుక యత్నాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కూచిపూడి, భరతనాట్యం, గాత్ర కచేరీ, సంగీత కచేరీలతో ఒకప్పుడు కళకళలాడిన దుర్గగుడి కళావేదిక నేడు కళాప్రదర్శనలు లేక వెలవెలబోతోంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని రాజగోపురం ఎదుట దేవస్థానం కళాకారుల ప్రదర్శనల కోసం కళావేదికను ఏర్పాటు చేసింది. గత ఏడాదిలో నెలకు దాదాపు 20 రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలతో నిత్య కల్యాణం... పచ్చతోరణంలా కళావేదిక వెలిగిపోయేది. ఈ ఏడాది తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతి పర్వదినాన సైతం కనీసం కళా ప్రదర్శనలు లేకుండా పోయాయి. అయితే ఏడాది కాలంలో దుర్గగుడి అధికారులు కళాకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారంలో ఒకటి, రెండు రోజులు మినహా కళాప్రదర్శనలు జరిగేది. కొంతకాలం తర్వాత కేవలం భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్ర , శని, ఆదివారాలు మాత్రమే కళాప్రదర్శనలకు అనుమతించారు. ఇప్పుడు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కళా ప్రదర్శన చూడటమే గగనమైందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళావేదిక అంటే కళా ప్రదర్శనల కోసం కాకుండా కేవలం నెలలో ఒక సారి జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణం కోసమే అన్నట్టుగా ఉందని భక్తులు అంటున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి సైతం...
అమ్మవారి ఆలయంలో తమ కళలను ప్రదర్శించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, ఢిల్లీ, ఒడిశాల నుంచి సైతం కళాకారులు దరఖాస్తు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో కళాప్రదర్శన ఇవ్వడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకునే చిన్నారులు తాము గజ్జెలు కట్టిన తర్వాత తొలిసారిగా అమ్మవారి సన్నిధిలో కళాప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం తమకు నామమాత్రంగా ఇచ్చే పారితోషికం ఇవ్వకపోయినా, ఉచితంగా అయినా అమ్మవారి సన్నిధిలో కళా ప్రదర్శన ఇచ్చేందుకు అనేక మంది కళాకారులు ముందుకు వస్తున్నారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలోని కళావేదికను కొండ కిందకు తరలించాలని దేవదాయ శాఖలోని ముఖ్య అధికారి దుర్గగుడి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా ఉత్సవాల అనంతరం లక్షలాది రూపాయలు వెచ్చించి కళావేదికకు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. కనీసం మరమ్మతులు చేసిన బిల్లు కూడా ఇంకా చెల్లింపులు అవకుండా కళావేదికను తొలగించాలని చూడటం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. అమ్మవారి సన్నిధిలో కళావేదిక కొనసాగిస్తారో లేక కొండ దిగువకు తరలిస్తారో వేచి చూడాలి.


