జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన
అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో గణతంత్ర దినోత్సవంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, జిల్లా ప్రగతిని వివరించేలా శకటాలను రూపొందించటంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పేదరిక నిర్మూలన, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, నీటి నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, కలంకారీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.


