తీరం పొడవునా భారీ కోత
కోడూరు: హంసలదీవి సాగరతీరం పొడవునా భారీ కోత ఏర్పడింది. పాలకాయతిప్ప బీచ్ నుంచి హంసలదీవి సాగరసంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి. గతంలో కేవలం సంగమ ప్రాంతంలో మాత్రమే కోత ఉండగా, ప్రస్తుతం బీచ్ వద్ద కూడా కోత ఏర్పడడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర రహదారికి సమాంతరంగా ఈ కోత ఏర్పడింది. సముద్రాన్ని, తీరం ఒడ్డును వేరు చేస్తున్నట్లు ఈ కోత సుమారు మూడు అడుగుల మేర ఉంది. ఇటీవల తుపాన్ల సమయంలో కొంతమేర కోత ఏర్పడిందని, క్రమేణా పెరుగుతూ కోత రహదారి అంచును తాకిందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. సంగమం వద్ద కృష్ణమ్మ పాదాలు, విగ్రహం చుట్టూ కూడా ఇసుకతిన్నెలు భారీగా కోతకు గురయ్యాయి.


