బరితెగించి ఘర్షణలు
సంక్రాంతి బరుల్లో రెచ్చిపోయిన నిర్వాహకులు ఘర్షణలపై ఎక్కడా నమోదవని కేసులు
ఫిర్యాదులు అందలేదు
కంకిపాడు: సంక్రాంతి బరులు బీభత్సకాండకు వేదికలయ్యాయి. అడుగడుగునా ఘర్షణలు, తోపులాటలతో ఉద్రిక్తంగా సాగాయి. బరుల్లో జరిగిన అమానుష చర్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయినా పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ఘటనలపై ఎలాంటి కేసులూ నమోదవ లేదు. సంక్రాంతి బరుల నిర్వాహకులపై తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని పోలీసులు చెప్పడం గమ నార్హం. పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బరుల వద్ద యథేచ్ఛగా కోడిపందేలను నిర్వహించారు. బరుల్లో కోడి పందేలతో పాటుగా పేకాట, లోన–బయట, గుండాట, కోతముక్క, పూల్‌గేమ్ వంటి జూద క్రీడలు ఎన్నో జరిపించారు. సంక్రాంతి పండుగ ముందు రోజు నుంచి శుక్రవారం రాత్రి వరకూ జూదం, కోడిపందేలను అధికారపక్షం అండతో నిర్వాహకులు బరితెగించి జరిపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నా సంక్రాంతి బరులు అడ్డగోలుగా సాగాయి. కంకిపాడు బైపాస్ వెంబడి బరిలో పేకాట నిర్వాహకుడు అధికారపక్షం సహకారంతో పందేల గడువు ముగిశాక స్థానికంగా ఉన్న ఓ వెంచరులో టేబుళ్లు ఏర్పాటుచేయించి పేకాట జరిపించేలా అందరూ సహకరించారని తెలుస్తోంది.
బరుల్లో అమానుషం
ఈడుపుగల్లు బరిలో పేకాట (లోన–బయట) నిర్వహణ విషయంలో జూదరులకు, బరి పర్యవేక్షకులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ పేక నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. ఆ విషయమై ప్రశ్నించిన జూదరిపై బరి పర్యవేక్షకులు, బందోబస్తుకు నియమించిన వ్యక్తులు దాడి చేసినన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉప్పలూరు బరిలో కొందరు యువకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ చిన్న వివాదం కాస్తా ముదిరి ఘర్షణకు దారి తీయటంతో రెండు వర్గాల యువకులు కొట్లాటకు తెగబడ్డారు. రెండు వర్గాల మధ్య గొడవ బీభత్సానికి దారితీసింది. చివరికి స్థానికులు చొరవతీసుకోవటంతో వివాదం ముగిసింది. మరో వైపు తోట్లవల్లూరుకు చెందిన 11 మందిని ఉప్పలూరు బరి ప్రాంగణంలో కొందరు వ్యక్తులు చొక్కాలు విప్పించి తాళ్లతో కట్టేసి హంగామా చేశారు. ‘ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు? ఒక్కొక్కరు ఎంత దొంగ తనం చేశారు? గజ దొంగల్లా ఉన్నారే?’ అంటూ వారు చేసిన వ్యాఖ్యలతో ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తప్పు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్ష పడేలా పోలీసులకు అప్పగించాలే కానీ అమానవీయంగా చొక్కాలు విప్పించటం, చేతులు తాళ్లతో కట్టేయటం ఏమిటంటూ నెటిజన్లు, ప్రజాతంత్ర వాదులు విమర్శిస్తున్న పరిస్థితి. అయితే అప్పు విషయమై జరిగిన లావాదేవీలపై కొందరు వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించటంతో అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పటం గమనార్హం. అయితే స్టేషన్‌లో నమోదైన కేసుకు, వీడియోల్లో జరిగిన సంభాషణలకు సంబంధం లేకపోవటం విశేషం. మరో వైపు బరుల్లో జరిగిన ఘర్షణలపై చిన్న కేసు కూడా నమోదు కాలేదు. శాంతిభద్రతల అంశం తలెత్తితే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవటం, కేసులు నమోదు చేయటం సాధారణం. అయితే ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేవు.
భీతిల్లిన జనం
సందడిగా జరుపుకొనే సంక్రాంతి కాస్తా ఈసారి బీభత్సకాండను తలపించటంతో సామాన్య ప్రజలు భీతిల్లారు. బరుల్లో చోటుచేసుకున్న ఘటనలతో వణికిపోయారు. సంప్రదాయబద్ధంగా వేడుకగా సాగే కోడి పందేలు, జూద క్రీడలు ఘర్షణలు, కొట్లాటకు దారితీయటంపై జనం మండిపడుతున్నారు. అధికారపక్ష నేతల బరితెగింపుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
బరుల్లో ఘర్షణలు, కొట్లాటలు జరిగాయని ఎలాంటి ఫిర్యాదులూ అందలేదు. ఫిర్యాదులు వస్తే కేసులు నమోదుచేస్తాం. తోట్లవల్లూరుకు చెందిన వ్యక్తుల విషయంలో అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. చర్యలు తీసుకుంటాం.
– డి.సందీప్, ఎస్‌ఐ, కంకిపాడు
బరితెగించి ఘర్షణలు


