సాగరతీరానికి పర్యాటక శోభ
కోడూరు: సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హంసలదీవి సాగరతీరం పర్యాటక శోభతో కళకళలాడింది. సెలవుల సందర్భంగా స్వగ్రామాలకు వచ్చిన వారంతా కుటుంబ సమేతంగా సాగరతీరానికి వచ్చి సందడి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల నుంచి పర్యాటకులు ప్రత్యేక వాహనాల్లో సాగరతీరానికి తరలివచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో సేదతీరి, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. యువకుల క్రికెట్, వాలీబాల్ ఆటలతో ఉత్సాహంగా గడిపారు. పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
చిలకలపూడి (మచిలీపట్నం): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శబ్ద, వాయు కాలుష్య నియంత్రణ కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. వాయుకాలుష్య నియంత్రణ కోసం ప్రతి శనివారం ప్రతి ఉద్యోగి, ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చేందుకు కాలినడకన లేదా సైకిల్‌పై రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలికోసం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): తమ ఆర్థికాభివృద్ధికి చేయూత ఇచ్చేలా ఏర్పాటు చేసిన రైజ్ సెంటర్ సేవలను స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ సెంటర్‌లో మహిళల శిక్షణ సదస్సును ఆయన శనివారం పరిశీలించారు. చేతి వృత్తుల ద్వారా వివిధ ఉత్ప త్తులను రూపొందించి, మార్కెటింగ్ చేస్తున్న మహిళతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైజ్ సెంటర్‌లో గత జూలై నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. కంప్యూటర్ ఎక్స్‌ఎల్, ఎంఎస్ ఆఫీస్ వంటి కోర్సులను మహిళలు ఉచితంగా నేర్చుకోవచ్చని సూచించారు. డీఆర్వో పీడీ నాంచారరావు, మెప్మా పీడీ కృష్ణ ప్రసాద్, ఆర్డీఓ చైతన్య, ఉద్యానశాఖ అధికారి బాలాజీకుమార్, స్కిల్ డవలప్‌మెంట్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): పశు సంవర్ధక సేవలను పశుపోషకులకు మరింత చేరువ చేయడానికి ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు కృష్ణా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వ హిస్తామని కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. ఈ శిబిరాల పోస్టర్‌ను తన చాంబర్‌లో శనివారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ శిబిరాల్లో జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడంతోపాటు, ఎదకు రాని పశువులకు పరీక్షలు నిర్వహించి సూచనలు చేస్తారని పేర్కొన్నారు. గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వైద్యసహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి మండలానికి రెండు చొప్పున 26 మండలాలకు 52 టీమ్‌లను ఏర్పాటు చేసి శిబిరాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ చిన నరసింహులు, డాక్టర్ మధుబాబు, డాక్టర్ విజయ కుమార్ పాల్గొన్నారు.
సాగరతీరానికి పర్యాటక శోభ


