రెడ్ బుక్‌కు పరాకాష్ట సాల్మన్ హత్య
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్‌విక్టర్
గుడివాడ టౌన్: మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యకు గురయ్యాడని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. సాల్మన్‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్‌విక్టర్ డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడులో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద సాల్మన్ హత్యను ఖండిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. డౌన్ డౌన్ హోం మంత్రి, డౌన్ డౌన్ చంద్రబాబు అన్న నినాదాలు హోరెత్తాయి. దళితులపై దాడులను ఆపాలి, నిందితులను కఠినంగా శిక్షించా లని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో దళితులపై హత్యలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై వివక్ష పెరిగిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చెయ్యడం, హత్యలకు తెగబడటం, గ్రామ బహిష్కరణ విధించడం, కుల వివక్షతో చిన్నారులను సైతం వేధించడం వంటి దారుణాలు పెచ్చుమీరాయని విమర్శించారు. ఎన్నికల అనంతరం రెండేళ్లగా గ్రామం విడిచి జీవిస్తున్న మందా సాల్మన్ అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు సొంతూరికి వస్తే టీడీపీ గూండాలు ఇనుపరాడ్లతో దాడికి పాల్పడి హత్య చెయ్యడం దుర్మార్గమన్నారు. టీడీపీ నాయకుల అండతోనే ఈ హత్య జరిగిందని విమర్శించారు. ఈ కేసులో నింది తులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పెయ్యల ఆదాము, మెండా కిరణ్, ఆర్.చిన్నా, కారె జోసఫ్, సీహెచ్.నాని, సీహెచ్.జోషి, కె.నాగరాజు, జి.రవి, సురేఖ, మామిళ్ల ఎలీషా, ఎన్.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


