ఆగిన గుండెను తట్టిలేపే సీపీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగిన గుండెను తట్టిలేపే సీపీఆర్‌

Jan 17 2026 11:47 AM | Updated on Jan 17 2026 11:47 AM

ఆగిన గుండెను తట్టిలేపే సీపీఆర్‌

ఆగిన గుండెను తట్టిలేపే సీపీఆర్‌

సీపీఆర్‌ అంటే.. అత్యవసర వేళ ఇది సంజీవనే

లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు.. విద్యుత్‌షాక్‌.. నీటిలో మునక.. వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు అకస్మాత్తుగా గుండె ఆడిపోతుంది. అలాంటి సమయంలో అప్రమత్తమై ఛాతీపై ఒత్తిడి (కార్డియో పల్మనరీ రీససిటేషన్‌–సీపీఆర్‌) చేయడం ద్వారా తిరిగి గుండె కొట్టుకునేలా చేయవచ్చని క్రిటికల్‌ కేర్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంపై అవగాహన ఎంతో ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.

షాక్‌కు గురైతే ఇలా చేయాలి..

ఎలక్ట్రికల్‌ షాక్‌కు గురైనప్పుడు గుండె షార్ట్‌ సర్క్యూట్‌ అవుతుంది. గుండె వేగం నిమిషానికి 400 నుంచి 500 సార్లు కొట్టుకోవడంతో శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఈ సమయంలో సీపీఆర్‌ చేస్తూనే వీలయినంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అక్కడ రోగిని పరీక్షించి డీసీ విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. నీట మునిగిన వారిని ఒడ్డుకు చేర్చిన తర్వాత కార్డియాక్‌ అరెస్టు అయితే సీపీఆర్‌ను అనుసరించాలంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో సైతం ఒక్కో సమయంలో గుండె ఆగిపోతుందని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

ఎస్‌ఎంసీలో స్కిల్‌ ల్యాబ్‌..

ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో స్కిల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి, గత ప్రభుత్వంలో పోలీస్‌, ఫైర్‌, ఇతర అత్యవసర సేవల సిబ్బందికి బేసిక్‌ లైఫ్‌ సపోర్టు విధానాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో అడ్వాన్స్‌డ్‌ బేసిక్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌లో రోగిని తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ప్రస్తుతం ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

అకస్మాత్తుగా కుప్పకూలిన వ్యక్తి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ అయినట్టు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు సీపీఆర్‌ పద్ధతిని అనుసరించాలి. కుప్పకూలిన వ్యక్తిని చదునుగా ఉన్న ప్రాంతానికి తీసుకు వచ్చి వెల్లకిలా పడుకోబెట్టాలి. పల్స్‌ లేకపోతే వెంటనే రెండు చేతులతో ఛాతి మధ్య భాగంలో ఒత్తిడి చేయాలి. నిమిషానికి వందసార్లు నొక్కడం ద్వారా గుండె చేసే రక్తం పంపింగ్‌కు మనం కృత్రిమంగా చేసినట్లవుతుంది. దీంతో మెదడుకు రక్తప్రసరణ జరిగి బ్రెయిన్‌ డెత్‌ను నిరోధించడంతో పాటు, గుండె తిరిగి కొట్టుకునేలా చేయవచ్చు. ఇలా చేస్తూనే నోటి ద్వారా కృత్రిమంగా శ్వాస అందిస్తే రక్తంలో ఆక్సిజన్‌ శాతం కూడా సాధారణ స్థితికి చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement