ఆకట్టుకున్న మత్స్యకారులకు విసుర వల పోటీలు
నాగాయలంక: కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని మండవ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సౌజన్యం, ఏపీ సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి సహకారంతో స్థానిక శ్రీరామపాద క్షేత్రం ఘాట్ ప్రాంగణంలో కృష్ణానది తీరాన శుక్రవారం సాయంత్రం విసురు వల పోటీలు నిర్వహించారు. కృష్ణానదిలో వృత్తి కళాత్మకంగా చేపల వేటలో వల విసరడం ఎంతో చాకచక్యంతో కూడి ఉంటుంది. దీని నైపుణ్యం ప్రామాణికంగా ఘాట్ ఒడ్డున ప్రత్యేకంగా అమర్చిన క్రీడా కోర్ట్‌లో విసురు వల నైపుణ్యతను పరిశీలించారు. వల వేటలో మొత్తం 30 మంది పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన ముగ్గురికి బహుమతులు, పోటీలో పాల్గొన్నవారికి ప్రోత్సాహకాలను ట్రస్ట్ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సేవా సమతి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు అందచేశారు. తొలుత మత్స్యకారులకు విసురు వల అందించి పోటీలను ప్రారంభించారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్ కర్రి కృష్ణమూర్తి, సేవా సమతి స్థానిక అధ్యక్షుడు నాగిడి తాతారావు, మత్స్యకార నేతలు రేవు సువర్ణరాజు, లంకె బుల్లి బసవయ్య, ఒడుగు దశరయ్య, నాగిడి పోతురాజు పాల్గొన్నారు. తలశిల రఘుశేఖర్, ఒడుగు వెంకటేశ్వరరావు పోటీలు నిర్వహించారు.


