పోరాట యోధుడు వడ్డే ఓబన్న
చిలకలపూడి(మచిలీపట్నం): దేశం కోసం బ్రిటీష్ వారితో పోరాటం చేసిన యోధుడు వడ్డే ఓబన్న అని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఆదివారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతో మందిలో వడ్డే ఓబన్న ఒకరన్నారు. బ్రిటీష్ ప్రభుత్వంలో వడ్డే ఓబన్న గ్రామరక్షకుడిగా ఉద్యోగం చేస్తూ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోరాటానికి దిగారన్నారు. ఓబన్న గురించి రాసిన పుస్తకం కర్నూలులో ఉన్నట్లు తమకు తెలిసిందని దాని ప్రతిని తెప్పించి కలెక్టరేట్‌లోని గ్రంథాలయంలో ఉంచుతామన్నారు. బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి. రమేష్, గిరిజన సంక్షేమాధికారి ఫణిదూర్జటి, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
హోరాహోరీగా రెవెన్యూ ఉద్యోగుల సంఘ ఎన్నికలు
చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృష్ణాజిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. స్థానిక రెవెన్యూ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడ్డాయి. పేటేటి సత్యనారాయణ 12మంది సభ్యులతో ప్యానల్‌గా, ఎంవీ శ్యామ్‌నాఽథ్ 12 మంది సభ్యులతో ప్యానల్‌గా పోటీపడ్డారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పేటేటి సత్యనారాయణ అధ్యక్షుడిగా గెలుపొందగా, ఎంవీ శ్యామ్‌నాఽథ్ ప్యానల్ సభ్యులు ఎక్కువ మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరో ప్యానల్‌లోని ఎంవీ శ్యామ్‌నాఽథ్ ఎన్నికయ్యారు.


