14 నుంచి రాష్ట్ర స్థాయి వృషభ రాజాల బండ లాగుడు ప్రదర్శన
ఘంటసాల: మన ఊరు – మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఘంటసాల గ్రామంలో గొర్రె పాటి నవనీతకృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వృషభ రాజాల బండ లాగుడు ప్రదర్శనలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఘంటసాల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే బండ లాగుడు ప్రదర్శన పోటీల కరపత్రాలను ఆదివారం పంపిణీ చేయడంతో పాటు ప్రదర్శన ఏర్పాట్లను నిర్వాహకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 14న ఆరుపళ్ల విభాగం ప్రదర్శన, 15న న్యూ కేటగిరి ప్రదర్శన, 16న రెండు పళ్లు విభాగంలో ప్రదర్శనతో పాటు ప్రతి రోజూ విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తామన్నారు. 14న ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రదర్శన కమిటీ ప్రతినిధులు బండి పరాత్పరరావు, దోనేపూడి రవి శంకర్, గొర్రెపాటి సురేష్, గొర్రెపాటి శ్రీనివాస్, మూల్పూరి చెన్న కేశవరావు, కొండపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


