ఆకట్టుకున్న ఆవుల అందాల పోటీలు
గన్నవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆవుల అందాల పోటీలను నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకువచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన పశువులకు సంబంధించిన యాజమానులకు 6.50 లక్షల నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. పోటీల నిర్వాహకులు కాసరనేని రాజా, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం ఇన్‌చార్జ్ సర్పంచ్ పాలడుగు నాని, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ పాల్గొన్నారు.
పోటీల్లో విజేతల వివరాలు..
ఈ పోటీల్లో ఒంగోలు జాతి పళ్లు కలిపిన ఆవుల విభాగంలో ఏలూరు జిల్లాకు చెందిన అడపా శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఇస్రంపేటకు చెందిన తువ్వాటి బాలకృష్ణ, తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా సుబ్బారావు ఆవులు మూడు స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి ఆరు పళ్ల విభాగంలో కంకిపాడుకు చెందిన వట్టి కృష్ణయ్య ఆవులు ద్వితీయ స్థానం, నాలుగు పళ్ల విభాగంలో పమిడిముక్కల మండలం పమిడిగుంటపాలెంకు చెందిన మైనేని వంశీకృష్ణ మొదటి స్థానం, ఒంగోలు జాతి రెండు పళ్ల విభాగంలో పెనమలూరుకు చెందిన కిలారు వెంకటేశ్వరరావు ఆవులు మొదటి స్థానంలో నిలిచాయి,
బెంజిసర్కిల్ వద్ద కారు దగ్ధం
పటమట(విజయవాడతూర్పు): తాడేపల్లి నుంచి కానూరు వస్తున్న ిఓ కారు బెంజిసర్కిల్ వద్దకు రాగానే మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేయటంతో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన పాకనాటి గౌతమ్‌రాజ్ కానూరు మెయిన్‌రోడ్డులో ఉన్న పీఆర్ హాస్పిటల్స్‌లో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆదివారం తాడేపల్లిలో వ్యక్తిగత పని ముగించుకుని తన ఈవీ(ఎలక్ట్రికల్ వెహికల్) కారులో ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో బెంజిసర్కిల్ దాటిన తర్వాత సర్వోత్తమ గ్రంథాలయ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి కారులో పొగలు రావటం చూసి స్థానికులు గౌతమ్‌రాజ్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే కారును పక్కన ఆపి కారు దిగాడు. అదే సమయంలో మంటలు పెద్దగా వ్యాపించటంతో స్థానికులు ఆటోనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆకట్టుకున్న ఆవుల అందాల పోటీలు


