సంక్రాంతి సందడి షురూ !
కీసర(కంచికచర్ల): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇతర రాష్ట్రాల్లో నివసించే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆదివారం కూడా కార్లు, ఇతర వాహనాలలో సొంతూళ్లకు బయలుదేరారు. కంచికచర్ల మండలంలోని కీసర టోల్‌ప్లాజా వద్ద ఏడు కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఫాస్టాగ్ సిస్టం ఉండటంతో వాహనాలన్నీ ఆగకుండా వెళ్తున్నాయి. ఆదివారం 14 వేల వాహనాలు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్లాయని ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ ఏడా ది అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారు. ప్లాజా వద్ద వాహనాలు నిలబడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జయప్రకాష్ చెప్పారు.
ఆయుష్‌లో ఈఎస్‌ఐ సేవలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ సేవలను అధికారికంగా ప్రారంభించినట్లు ఆస్పత్రి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.జయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సేవల ప్రారంభంతో వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ ద్వారా నాణ్యమైన, సమగ్ర వైద్య సేవలు తమ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈఎస్‌ఐలో అర్హులైన లబ్ధిదారులకు, అవుట్ పేషెంట్స్, ఇన్‌పేషెంట్ సేవలతో పాటు డయాగ్నోస్టిక్ పరీక్షలు, శస్త్రచికిత్సలు, అవసరమైన ఇతర వైద్య సేవలను పొందవచ్చన్నారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్, సీజీహెచ్‌ఎస్ నిబంధనల ప్రకారం సేవలు అందించనున్నట్లు జయలక్ష్మి తెలిపారు. ఈఎస్‌ఐ లబ్ధిదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
నున్నలో కోడిపందేల బరులు ధ్వంసం
టాస్క్‌ఫోర్స్: విజయవాడ రూరల్ మండలం నున్న శివారులోని వికాస్ కాలేజీ రోడ్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు కోడిపందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన బరులను పోలీసులు ఆదివారం సాయంత్రం ధ్వంసం చేశారు. కోడి పందేల నిర్వహణపై టీడీపీ నేతలు నున్నలో సమావేశమై చర్చించుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షిలో ‘మూడు రోజులు కోడి పందేలు పెట్టేద్దాం’ శీర్షికన ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కోడి పందేల కోసం సిద్ధం చేసిన బరులను పరిశీలించారు. ట్రాక్టర్లతో సదరు బరులను ధ్వంసం చేశారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆదేశాలను ఉల్లంఘించి కోడిపందేలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. సీఐ కృష్ణమోహన్, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
స్థిరాస్తి సమకూర్చుకునేందుకు క్రెడాయ్ దిక్సూచి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో స్థిరాస్తి సమకూర్చుకునేందుకు ఇదే సరైన సమయమని ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్ ఆరె.శివారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి క్రెడాయ్ దిక్సూచిగా వ్యవహరిస్తోందన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన 11వ క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సభకు శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మధ్య తరగతి వారు సొంతిల్లు సమకూర్చుకునేలా పెట్టుబడులు పెడుతున్నారని, నిర్మాణ రంగం గాడిలో పడుతోందనడానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం అటు రియల్ ఎస్టేట్ రంగానికి, ఇటు నిర్మాణ రంగానికి అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్రెడాయ్ విభాగం ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన వృద్ధి వస్తుందని ఆకాంక్షించారు. భవన నిర్మాణ రంగం బాగుంటే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విజయవాడ క్రెడాయ్ విభాగం చైర్మన్ సీహెచ్ సతీష్ బాబు, ప్రెసిడెంట్ జీఎస్‌ఆర్ మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి కె.రఘురామ్, కోశాధికారి సత్య సాయిరామ్ పాల్గొన్నారు.
సంక్రాంతి సందడి షురూ !
సంక్రాంతి సందడి షురూ !
సంక్రాంతి సందడి షురూ !


