అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఉయ్యూరు: నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆదివారం ఉయ్యూరు టౌన్ పోలీసుస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఐ భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్ననాటి నుంచే విలాసాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారు నగల దుకాణాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుస్టేషన్‌లో చోరీ కేసు నమోదైంది. మధ్యాహ్న భోజన సమయాన్ని అదునుగా చేసుకుని నగల దుకాణాల్లోకి చొరబడి ఆభరణాలను అపహరిస్తుంటాడు.
చోరీ సొత్తు కొంటున్న వ్యక్తి పట్టివేత..
ఈ క్రమంలో గత నెల 20న ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో శ్రీకృష్ణసాయి జ్యూయలర్స్‌లో షాపు యజమానురాలు భోజనం చేస్తున్న సమయంలో షాపులోకి ప్రవేశించి 80 గ్రాములు విలువైన 35 జతల బంగారు చెవి దిద్దులను అపహరించుకుపోయాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సత్యనారాయణను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు, ఉయ్యూరు పట్టణ సీఐ రామారావు సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఉయ్యూరు మార్కెట్‌యార్డు సమీపంలో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 30 జతల చెవి దిద్దులు, 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. సత్యనారాయణతో పాటు చోరీ సొత్తు కొనటానికి వచ్చిన కంచర్ల సాయిసుధీర్‌ను గుంటూరు నల్లచెరువు సమీపంలో అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


