వైఎస్సార్ సీపీ మాజీ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి చెందిన వైఎస్సార్ సీపీ మాజీ కౌన్సిలర్ కోసూరి లక్ష్మీనాంచారయ్య ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కారణం తాను అతిగా నమ్మిన వ్యక్తి మోసం చేయటమని మీడియా ఎదుట వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కథనం మేరకు.. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలకు సంబంధించి మాజీ కౌన్సిలర్ నాంచారయ్య తన కుమార్తె పేరుతో పాటు తనకు అత్యంత సన్నిహితుడైన పసుపులేని అనిల్ పేరిట వైన్‌షాపులకు దరఖాస్తు చేశారు. లాటరీలో నాంచారయ్య కుమార్తె పేరుతో పాటు అనిల్ పేరిట షాపులు దక్కాయి. మచిలీపట్నంలోని కోటావారితుళ్ల సెంటర్‌లో షాపు నిర్వహిస్తున్నారు. అనిల్ పేరు మీద వచ్చిన లైసెన్స్‌కు సంబంధించి ఎకై ్సజ్‌శాఖకు చెల్లించాల్సిన నగదు మొత్తం నాంచారయ్య భరించారు. ఈ క్రమంలో రూ.50 లక్షలు ఇవ్వాలని లేదంటే తన షాపు తనకు ఇచ్చేయాలని అనిల్ వేధిస్తున్నాడు. దీంతో వివాదం జరుగుతోంది.
జనసేన నాయకుడి ప్రోద్బలంతో..
శనివారం అనిల్ ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌లో నాంచారయ్యపై ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం అనిల్ జనసేనపార్టీకి చెందిన ఓ నాయకుడి ప్రోద్బలంతో మద్యం షాపునకు వెళ్లి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాలో చూసిన నాంచారయ్య వైన్‌షాపు వద్దకు వెళ్లారు. అనిల్ ప్రవర్తనతో విసుగుచెంది షాపు వద్దే డబ్బాలోని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో సిబ్బంది నాంచారయ్యను చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నాంచారయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను ఆత్మహత్యకు కారణం పసుపులేటి అనిల్, పసుపులేటి వేణుగోపాలరావు, పోతన వంశీ అని తెలిపారు. నాంచారయ్య అతని బంధువర్గం తనపై దాడి చేసినట్లు అనిల్ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చేరాడు.
మద్యం షాపు లైసెన్స్‌దారుడి వేధింపులే కారణమంటూ ఆవేదన


