కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ, చంద్రబాబు
భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఖమ్మంలో జరుగనున్న పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం భవానీపురం వెంకటేశ్వర ఫౌండ్రీ వద్ద నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుంచి స్వాతి సెంటర్, సితార సెంటర్, చిట్టినగర్, కాళేశ్వరరావు మార్కెట్, కృష్ణలంక స్వర్గపురి వద్దకు ర్యాలీ చేరుకుంది.
కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తి.. శతాబ్ది ఉత్సవాలు
ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, చంద్రబాబు కార్మికుల హక్కుల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుండటం దుర్మార్గమన్నారు. అన్ని వర్గాలకు చెందాల్సిన సంపదను కేవలం కొద్ది మందికి మాత్రమే చేరేలా వారు నిర్ణయాలను తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మాజీ మేయర్ టి.వెంకటేశ్వరరావు నాయకత్వంలో సీపీఐ రెండు సార్లు విజయవాడ నగరాన్ని పాలించిందని, పౌరులపై భారాలు మోపకుండా ప్రజాసంక్షేమంపై దృష్టి సారించిందన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తిని శతాబ్ది ఉత్సవాలు సూచిస్తున్నాయని చెప్పారు. ర్యాలీలో నగర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్లలోని పార్టీ కార్యదర్శులు, ప్రజాసంఘాల కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య


