సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సూపర్‌స్టార్ కృష్ణ పేరు నిలబెట్టడమే తన లక్ష్యమని ఆయన మనువడు వర్థమాన హీరో జయకృష్ణ అన్నారు. విజయవాడ లెనిన్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన సూపర్‌స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఘట్టమనేని జయకృష్ణ, శేషగిరిరావు పాల్గొని సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈనాడు సినిమాలోని రామరాజు పాత్ర గెటప్‌లో ఉన్న విగ్రహం ఏర్పాటు చేశారు.
జయకృష్ణను ప్రేక్షకులు ఆదరించాలి..
ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ.. అగ్నిపర్వతం సినిమా విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాత కృష్ణ విగ్రహం అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విగ్రహావిష్కరణకు వచ్చి అభిమానులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తనకు బాబాయ్ మహేష్ బాబు సపోర్ట్ ఉందన్నారు. తను నటించే సినిమా ఫస్ట్ లుక్‌ను మహేష్ బాబు లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ అని కొనియాడారు. ఘట్టమనేని శేషగిరిరావు మాట్లాడుతూ జయకృష్ణను ప్రేక్షకులు ఆదరించాలని, కృష్ణ లెగసీ కొనసాగాలన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, నిర్మాత జెమిని కిరణ్, విగ్రహ కమిటీ సభ్యులు సుధాస్వామి, శీరం బుజ్జి, జితేంద్ర, పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.


