రీసర్వేకు సహకరించాలి
ఆక్వా రైతులకు కలెక్టర్ బాలాజీ సూచన
నందివాడ: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన రీసర్వేకు ఆక్వా రైతులు సహకరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. నందివాడ మండలం అనమనపూడి గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆక్వా భూముల రీసర్వే సమస్యలపై అనమనపూడి, దండిగనపూడి, గండేపూడి గ్రామాల రైతులతో శనివారం సాయంత్రం కలెక్టర్ సమావేశమై చర్చించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. నందివాడ మండలంలో ఆక్వా సాగు అధిక మని, వ్యక్తిగతంగా కాకుండా ఒకే చెరువు కింద అనేక మంది రైతులకు చెందిన భూములు సాగులో ఉన్నాయన్నారు. వాటికి రీసర్వే చేసే క్రమంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి భూముల విషయంలో సరిహద్దులు, భూవిస్తీర్ణం సరిపోలిన వాటికి సబ్ డివిజన్ చేసి ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సెల్ మ్యాప్) సంఖ్య కేటాయిస్తామన్నారు. ఉమ్మడి భూములకు జాయింట్ ఎల్‌పీఎం కేటాయిస్తే భవిష్యత్తులో ఆయా భూముల రైతులకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రైతులు సహకరించాలని కోరారు. ఉమ్మడి భూముల విస్తీర్ణం విషయంలో రైతులు ఏకాభిప్రాయంతో ముందుకొస్తే చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల మహిళలు కలెక్టర్‌ను కలిసి గుడివాడ నుంచి తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం కేవలం విద్యార్థుల కోసం మాత్రమే ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులు వస్తున్నాయని, గ్రామంలోని ప్రజల కోసం అదనంగా బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు. తహసీల్దారు గురునాథ్ మూర్తి, సర్పంచి అడుసుమిల్లి సీతామహాలక్ష్మి, మండల, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


