అస్త్రమ్ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆధ్వర్యంలో రూపొందించిన అస్ట్రమ్ ప్రాజెక్టుకు స్కోచ్–2025 గోల్డ్ కేటగిరీ అవార్డు దక్కింది. ట్రాఫిక్ నిర్వహణ, పాలన, ప్రజాసేవలో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ పోలీస్, భద్రత కింద స్కోచ్–2025 గోల్డ్ అవార్డును ప్రదానం చేశారు. అక్టోబర్ 2024లో ప్రారంభించిన అస్త్రమ్ ప్రాజెక్టు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నగరంలోని ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు, సందేశాలు ఇస్తూ సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ట్రాఫిక్ రద్దీలో 50 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 30 శాతం తగ్గించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రజలకు గ్రీన్ చానల్ హోల్డింగ్ సమయం 15 నుంచి 20 నిమిషాల నుంచి కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలకు తగ్గింపు, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగు చర్యలు తీసుకున్నారు. అస్త్రమ్‌తో ప్రజలకు జరిగిన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్కోచ్–2025 గోల్డ్ కేటగిరీ అవార్డును ప్రకటించారు. ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్‌బేగం, స్పెషల్ బ్రాంచి ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి, టెక్నికల్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు.


