దూసుకొస్తున్న యువ కలాలు..
నూతన రచనలు చేస్తూ రాణిస్తున్న యువత పలు సాహితీ ప్రక్రియలను స్పృశిస్తూ అందరినీ అలరిస్తున్న వైనం పుస్తక మహోత్సవంలో స్టాల్ ఏర్పాటు చేసిన యువ కవులు కళాశాలల్లో చదువుతూనే రచనా వ్యాసంగం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): గడిచిన కొన్ని దశాబ్ధాలుగా తెలుగు సాహిత్యంలో యువతరం కనిపించిన దాఖలాలు చాలా తక్కువే. తెలుగు నాట పాతతరం రచయితలు తరువాత కొత్తగా వచ్చేవారు లేకుండా పోతున్నారని సభల్లో అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు అనేకం. ముఖ్యంగా ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ లేదా ఇంకొక వైపో ఉపాధి కోసం పరుగులు తీస్తున్న యువత సాహిత్యంపై దృష్టి సారించటం లేదనే వాదనల్లో వాస్తవం లేకపోలేదు. కానీ ఆ వాదనలకు, ఆ వ్యాఖ్యలకు భిన్నంగా నేటి యువత రచనా వ్యాసంగంలోకి అడుగులు పెడుతోంది. మేం సైతం రచనలు చేస్తాం.. అందరినీ అలరిస్తాం... అంటూ యువత సాహిత్య రంగం వైపు దూసుకొస్తుంది. తెలుగు సాహిత్య రంగంలో కొత్త పుంతలు తొక్కించేందుకు యువత కదం తొక్కటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రాచుర్యం పొందిన చాలా మంది సాహితీవేత్తల్లో చదువులు పూర్తయిన తరువాతే వారి రచనలు బాగా వెలుగులోకి వచ్చాయి. అలాగే చాలా రచనలు ఆ తరువాతే పుస్తక రూపంలో పాఠకులకు చేరువయ్యాయి. కానీ నేడు కొంతమంది యువ రచయితలు కళాశాలలో చదువుతూనే మరోవైపు సాహిత్యంలోనూ తమధైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. తమ రచనలను పుస్తక రూపంలో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.
చుట్టూ చూసిన అంశాలే నవలలుగా...
కొత్తగా వస్తున్న యువత తమ చుట్టూ కనిపిస్తున్న అంశాలనే నవలలుగా తీసుకొస్తున్నారు. సమాజంలో అనేక అటుపోటులను ఎదుర్కొంటున్న సామాజిక వర్గాల జీవన పోరాటాన్ని ఒక యువ రచయిత వివరిస్తూ నవలను తీసుకొచ్చాడు. మరో యువ రచయిత్రి తమకు ఆత్మీయులైన వ్యక్తులు మరణిస్తే అంతటితో తమ జీవితం సైతం అయిపోయిందని చాలా మంది భ్రమపడుతూ తీవ్రంగా కుమిలిపోతారు. అలాగే మహిళలు మరింత ఒత్తిడికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్న తీరును వివరిస్తూ ఒక నవలను తీసుకొచ్చింది.
దూసుకొస్తున్న యువ కలాలు..


