రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కొణకంచి(పెనుగంచిప్రోలు):రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కొణకంచి గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు వేదాద్రిలో స్వామి వారి దర్శనం అనంతరం అదుపు తప్పి కొణకంచి గ్రామ సమీపంలో చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకుని డ్రైవర్ పక్క సీటులో వైజాగ్‌కు చెందిన కూర్చొన్న ఎన్నింటి నీలకంఠ (45) అనే వ్యక్తి మృతి చెందగా డ్రైవర్ రమేష్‌తో పాటు కారులో ఉన్న పవన్ , శ్రీకాంత్, సాయికుమార్ మిగిలిన నలుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌గా పని చేస్తూ స్నేహితులతో కలిసి వేదాద్రిలో స్వామివారిని దర్శించుకుని విజయవాడ అమ్మవారి దర్శనానికి బయలు దేరారు. స్థానిక ఎస్‌ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం విషయం తెలుసుకున్న చిల్లకల్లు సూర్య శ్రీనివాస్, ఎస్‌ఐ–2 సాయి మణికంఠ సమాచారం తెలుసుకుని హుఠాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.


