ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల (ఐపీఈ–2026) నిర్వహణకు శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి హాల్‌లో గురువారం కలెక్టర్ లక్ష్మీశ.. ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయన్నారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు 98 కేంద్రాల్లో జరుగుతాయని వివరించారు. థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. 36,734 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,534 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు. జిల్లా స్ట్రాంగ్ రూమ్, 17 స్టోరేజ్ పాయింట్ల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. ప్రతి దశలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో నో సెల్ ఫోన్ జోన్‌గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు నాలుగు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, థియరీ పరీక్షలకు మూడు సిటింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వసతులు సమకూర్చాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఈసీ సభ్యులు జి.ఝాన్సీ, ఎన్.వెంకటరావు, జి.వెంకటరమణ, కె.విష్ణుకాంత్, డీఈవో ఎల్.చంద్రకళ, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, ఆర్టీసీ అధికారి టి.సాయిచరణ్‌తేజ, పోస్టల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


