ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
రహదారి భద్రత
అందరి బాధ్యత
కోనేరుసెంటర్: రహదారి భద్రత అందరి బాధ్యత అని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన గురువారం జిల్లా పోలీసులు హెల్మెట్ వాడకంపై మచిలీపట్నంలో బైక్ ర్యాలీ చేశారు. దీన్ని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కృష్ణాజిల్లా విస్తీర్ణం ఎక్కువ భాగం జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన రహదారి ప్రమాదాలను గమనిస్తే అత్యధిక శాతం ద్విచక్ర వాహనాల కారణంగా జరిగినట్లు తెలుస్తోందన్నారు. హెల్మెట్ లేక ఎంతోమంది వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రమాదాల కారణంగా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించకపోతే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామన్నారు. హెల్మెట్‌ధారణ అనేది బాధ్యతగా గుర్తించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపడం, మితిమీరిన వేగంతో వెళ్లడం, పరిమితికి మించి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పశువుల యజమానులు వారి పశువులను రోడ్లపై వదిలి ప్రమాదాలకు కారణమైనట్లు తెలిస్తే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసి కటకటాల పాల్జేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


