16న ‘కార్పొరేట్’ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం, విత్తన చట్టం, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి, ట్రేడ్ యూనియన్ల జేఏసీ, కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈనెల 16న గ్రామ గ్రామాన నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సమన్వయ సమితి సమావేశం జరిగింది. సమితి కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేస్తే కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చిందని, ఆ తర్వాత దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. దీనిపై 12న ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు, ఎడిటర్‌లను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర చైర్మన్ కామన ప్రభాకర్‌రావు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి, ఏపీ రైతు కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.


