ఆవకాయ్‌.. అసంబద్ధం | - | Sakshi
Sakshi News home page

ఆవకాయ్‌.. అసంబద్ధం

Jan 8 2026 6:24 AM | Updated on Jan 8 2026 6:24 AM

ఆవకాయ

ఆవకాయ్‌.. అసంబద్ధం

తెలుగు సినిమా, సాహిత్యం, కళలతో ఆవకాయ్‌కు సంబంధం ఏమిటి? ఉత్సవాల్లో తెలుగు సంస్కృతి, సాహిత్యానికి చోటు ఎక్కడ? మూడు రోజుల కార్యక్రమాల్లో ఉత్తర భారత సంస్కృతికే పెద్దపీట

రచయితల సంఘాలకు సమాచారం లేదు

భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు సినిమా, సాహిత్యం, కళల సమ్మేళనంగా ప్రభుత్వం మూడు రోజులపాటు విజయవాడలో ‘అమరావతి ఆవకాయ్‌’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తోంది. సినిమా, సాహిత్యం, కళలకు ఆవకాయ్‌తో సంబంధం ఏమిటో అర్థం కావడంలేదని పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టూరిజం ఉన్నతాధికారులకే అంతుబట్టక ‘ఇది అసం‘బద్ద’ ఆవకాయ్‌ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఆవకాయ్‌ ఫెస్టివల్‌ ఎందుకో? ఏమిటో? అంటూ తలలు పట్టుకుంటున్నారు. మూడు రోజుల ఆవకాయ్‌ కార్యక్రమాల్లో తెలుగు సంస్కృతి, సాహిత్యానికి సంబంధించి ఒకటీ అరా మినహా ఉత్తర భారత సంస్కృతికే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆవకాయ్‌ నామకరణం చేసిన టూరిజం అధికారితోపాటు ఈవెంట్‌ నిర్వాహకులు (టీమ్‌ వర్క్‌ ఆర్ట్స్‌) కూడా ఉత్తర భారత్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ కార్యక్రమాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలకు ఇంతవరకు సమాచారం లేకపోవడంతో వారు మండిపడుతున్నారు.

తెలుగు సంస్కృతికి చోటెక్కడ?

ఆవకాయ్‌ ఉత్సవంలో తొలిరోజు పున్నమిఘాట్‌లో జమ్మెర్స్‌ సంగీత ప్రదర్శన, ఒమాజియో పెర్ఫార్మింగ్‌ కంపెనీ వారి హర్‌ ఫ్రేమ్స్‌ – హర్‌ ఫైర్‌, రెండో రోజు మెహ్ఫిల్‌–ఏ–సుఖాన్‌ (అనుభూతినిచ్చే ముషైరా), ఆజ్‌ రంగ్‌ హై – ఏవీజీ వర్సెస్‌ నిజామీ బంధు (సంగీత విభావరి), మూడో రోజు చౌరాస్తా సంగీత ప్రదర్శన, జావేద్‌ అలీ సంగీత కచేరీ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక భవానీ ద్వీపంలో తుహోస్‌ ఆదిత్య రాయ్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ శిబిరం, నాధూలాల్‌ సోలంకితో నగారా శిక్షణ శిబిరం, ఫ్రెంచ్‌ నృత్య కళాకారులు గిల్లెస్‌ చుయొన్‌తో డాన్స్‌ శిక్షణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఉత్తర భారత సంస్కృతికే పెద్దపీట వేసినట్లుగా కళాకారులు పేర్కొంటున్నారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాలకు సంబంధించిన అనేక మంది సాహితీవేత్తలు, కళాకారులు ఉండగా వారికి ఈ కార్యక్రమాల్ల్లో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. తెలుగు వారికే సొంతమైన పద్య నాటకాలు, లబ్ధప్రతిష్టులైన అష్ట, శతావధానుల కార్యక్రమాలు, సంగీత విద్వాంసుల కచ్చేరీలు ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జానపద కళారూపమైన తోలుబొమ్మలాట ప్రదర్శన తప్ప గరగలు, తప్పెట నృత్యాలు వంటి అనేక సంప్రదాయ కళలపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులకు ఈ ఆవకాయ్‌లో స్థానం కల్పించకుండా మనదికాని సంస్కృతిని ఇక్కడ ప్రదర్శించటం ఎంతవరకు సమంజసమో నిర్వాహకులకే తెలియాలని అంటున్నారు.

అమరావతి ఆవకాయ్‌ను సంక్రాంతి మూడు రోజులు నిర్వహిస్తే బాగుండేది. ముందే నిర్వహించడం వల్ల విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌పై ప్రభావం పడుతుంది. అసలు కవులు, రచయితలకు ముఖాముఖి, కవి సమ్మేళనాలు ఉంటాయన్న విషయం తెలియదు. రచయితల సంఘాలకు ఎటువంటి సమాచారం లేదు. కార్యక్రమాల రూపకల్పన బాగేనే ఉంది కానీ దానిలో పరిపూర్ణత కనిపించడం లేదు. స్థానికులకు సమాచారం లేనప్పుడు రాష్ట్రం నుంచి ఎవరు పాల్గొంటారో అర్థం కావడం లేదు.

– చలపాక ప్రకాష్‌, ఏపీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

ఆవకాయ్‌.. అసంబద్ధం 1
1/1

ఆవకాయ్‌.. అసంబద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement