సమష్టి కృషితో రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమష్టి కృషితో రోడ్డు ప్రమాదాలకు నివారిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే కుటుంబాలను సురక్షితంగా నిలబెడతాయని సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డులో వాక్‌థాన్ నిర్వహించారు. ఈట్ స్ట్రీట్ వద్ద ట్రాఫిక్ డీసీపీ షరీన్‌బేగం, రవాణా శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకపోవడం, అధిక వేగాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు కుటుంబాలకు భద్రత కల్పిస్తాయన్నారు. శాసీ్త్రయ దృక్పథంతో ట్రాఫిక్ ప్రణాళికలను అమలుచేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. డీసీపీ షేక్ షరీన్ బేగం మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యని ఆందోళన వ్యక్తంచేశారు. హెల్మెట్ తప్పక ధరించాలని, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగన్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్, ఆర్టీఓలు ఆర్.ప్రవీణ్, ఎ.వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘ జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా సమన్వయకర్త కె. రమేష్, సుధీక్షణ్ ఫౌండేషన్ బాధ్యులు సీహెచ్ విమల, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.


