ఒత్తిడిని ఓడిస్తేనే ఆరోగ్యం పదిలం!
ఒత్తిడితో దుష్ఫలితాలు ఇవే..
ఇలా అధిగమించాలి..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిళ్లు సర్వరోగాలకు మూలకారణంగా నిలుస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందని, ఇన్‌ఫెక్షన్లతో పాటు అనేక సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల చిన్నారుల్లో ఆకస్మిక గుండెపోట్లకు ఒత్తిళ్లే కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇవే నిదర్శనాలు..
● పటమటకు చెందిన 40 ఏళ్ల విక్రమ్ కార్పొరేట్ సంస్థలో మంచి ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. నిద్ర పట్టక పోవడం, ఆలోచనలు ఎక్కువగా చేయడంతో తలనొప్పి, ఇతర రుగ్మతలకు గురయ్యాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు లేదని చెప్పి, ఒత్తిడే కారణమని తేల్చారు.
● లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల రాజేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్‌ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీస్‌కు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు అన్ని వర్గాలకు చెందిన వారు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.
కొరవడిన మానసికోల్లాసం..
నగరంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువులతో రోబోలుగా మారుతున్నారని అంటున్నారు. అంతేకాక వారిలో సామాజిక, నైతిక విలువుల కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. విద్యార్థుల ఆకాంక్షను పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాదు పెద్దవాళ్లు ప్రతి రోజూ ఆహ్లాదమైన వాతావరణంలో కాసేపు గడిపేందుకు అవసరమైన పార్కులు వంటివి అందుబాటులో లేవు. రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ చిక్కులతో మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇలా గుర్తించండి..
నిద్రలేమితో బాధపడుతున్నారా.. ఎల్లప్పుడూ దిగులుగా అనిపిస్తుందా.. ఏకాగ్రతా కుదరడం లేదా? అయితే మీకు మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్‌తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాటపడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించండి.
ఉరుకుల పరుగుల జీవితంతో మానసిక సమస్యలు
వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం
హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో
పీరియడ్స్ సమస్యలు
మానసిక ఉల్లాసంపై దృష్టి ఏదీ?
అదుపులో ఉండని దీర్ఘకాలిక వ్యాధులు
రుగ్మతలతో ఆస్పత్రులకు
క్యూ కడుతున్న వైనం
నిద్ర పట్టక పోవడం
ఆకలి లేకపోవడం, ఎక్కువ ఆహారం తినడం
ఒబెసిటీకి గురవడం
హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు
మధుమేహం, రక్తపోటు అదుపులో ఉండక పోవడం
తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు
వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్‌ఫెక్షన్స్ సోకడం
ప్రతిరోజూ 7 గంటలు తగ్గకుండా నిద్ర పోవడం, అది కూడా ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.
సమతుల్య ఆహారం తీసుకోవడం
ప్రతిరోజు వ్యాయామం చేయడం
యోగా, మెడిటేషన్‌పై దృష్టి సారించడం
సెల్‌ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవడం
భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండటం
అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవడం


