దుర్గమ్మకు విరాళంగా నగదు, వెండి కిరీటం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.4.50 లక్షల విరాళాలను అందజేశారు. విజయవాడ గుణదలకు చెందిన యార్లగడ్డ అమన్, మానవ్ కుటుంబ సభ్యులు నిత్యాన్నదానానికి రూ. 2 లక్షలు, రూ. 2.50 లక్షల విలువైన వెండితో తయారు చేయించిన కిరీటాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. వెండితో తయారు చేయించిన కిరీటానికి బంగారు పూత వేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బొడ్డు అనసూయ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు.
బాలికపై లైంగికదాడి
చందర్లపాడు(నందిగామ టౌన్): బాలికపై యువకుడు లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక పక్క గ్రామంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన ఆమైపె అదే గ్రామానికి చెందిన జాషువా అనే యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి డిసెంబర్ 26న ఇంట్లోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికై నా చెబితే ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పెట్టటంతో పాటు బాలికతో పాటు తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. బాలిక నీరసంగా ఉండటంతో పాటు హాస్టల్‌కు వెళ్లనని చెప్పటంతో ఏమైందంటూ తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించారు. జరిగింది చెప్పగా బుధవారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధర్మరాజు తెలిపారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.


