కోడలిపై మామ హత్యాయత్నం
కోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కోడలిపై మామ కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ కానిస్టేబుల్ మామను అడ్డుకోవటంతో కోడలు ప్రాణాలతో బయటపడింది. మచిలీపట్నం పరాస్ పేటకు చెందిన ఆకూరి నాగశ్వేతకు వలందపాలెంకు చెందిన కలిదిండి వెంకన్నతో 2022లో వివాహం జరిగింది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. ఏడాదిన్నరగా భార్యాభర్తలతో పాటు రెండు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో నాగశ్వేత పుట్టింట్లోనే ఉంటోంది. కాగా శ్వేత కాపురానికి రావాలంటూ భర్త వెంకన్నబాబు కోర్టులో పిటిషన్ వేశాడు.
పోలీస్ స్టేషన్‌కు కూతవేట దూరంలో..
ఈ క్రమంలో శ్వేత మామ సోమరాజు బుధవారం రాత్రి మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ మెడికల్ షాపు ఎదుట పదునైన కత్తితో కోడలిపై దాడి చేశాడు. ఆమెను అంత మొందించేందుకు తలపై బలంగా నరికాడు. శ్వేత చేయి అడ్డుపెట్టుకోవడంతో చేతితోపాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న ఈగల్ టీం కానిస్టేబుల్ మూర్తి సోమరాజును అడ్డుకున్నారు. అతని చేతిలో కత్తిని లాక్కుని సోమరాజును చిలకలపూడి పోలీసులకు అప్పగించారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న బందరు డీఎస్పీ సీహెచ్ రాజా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు శ్వేత మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్వేత తండ్రి రాజు ఎస్పీ కార్యాలయంలోని పీసీఆర్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కోడలిపై మామ హత్య చేసేందుకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన కోడలు


