తిరుపతమ్మకు నీరాజనాలు
● రంగుల మహోత్సవానికి
తరలివచ్చిన అమ్మవారు
● గ్రామాల్లో ఎడ్ల బండ్లకు భక్తుల ప్రత్యేక పూజలు
● ఈ నెల 28న పెనుగంచిప్రోలుకు
అమ్మవారి తిరుగు ప్రయాణం
జగ్గయ్యపేట: ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకొనే రంగుల మహోత్సవానికి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారితో పాటు సహదేవతల విగ్రహాలు మంగళవారం పట్టణంలోని దస్తావేజుల సెంటరు లోని రంగుల మండపం వద్దకు చేరుకున్నాయి. సోమవారం పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రత్యేక పూజలనంతరం రంగుల మహోత్సవానికి బయలు దేరిన అమ్మవారు, సహదేవతల విగ్రహాలు మక్కపేట, చిల్లకల్లు మీదుగా పట్టణానికి చేరుకున్నాయి. డప్పు, కోలాట వాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తున్న ఎడ్ల బండ్లకు భక్తులు ఎదురేగి వార పోసి స్వాగతం పలికారు. చిల్లకల్లు గ్రామంలోని ఆల్‌సెయింట్స్ పాఠశాల నుంచి రామ్‌కో క్వార్టర్స్ వద్దకు వచ్చేందుకు ఆరు గంటల సమయం పట్టింది. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ వద్ద విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు తోట సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠ, సిబ్బంది అమ్మవారికి వార పోసి స్వాగతం పలికారు. కళాకారులతో కలిసి సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది చిందేశారు. జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్ కళాశాల నుంచి రంగుల మండపం వరకు శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అమ్మవారికి పూజలు చేసి స్వాగతం పలికారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మండపంలో కొలువుదీరిన అమ్మవారు. సహదేవతలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దర్శించుకుని పూజలు చేశారు. రంగుల మహోత్సవాన్ని ముగించుకుని ఈ నెల 28వ తేదీన తిరిగి పెనుగంచి ప్రోలుకు అమ్మవారు పయనమవుతారు. రంగుల మండపం వద్ద ఆలయ సాంప్రదాయం ప్రకారం గాజర్ల వంశీయులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్, తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఈవో మహేశ్వరరెడ్డి, రంగుల మండపం కమిటీ సభ్యులు ఆకుల బాజీ, పంతంగి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తిరుపతమ్మకు నీరాజనాలు


