చిన్నారిని చితకబాదిన టీచర్, ఆయా
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్, ఆయా తీవ్రంగా కొట్టిన ఘటన విజయవాడ చిట్టినగర్‌లో జరిగింది. చిట్టినగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో కలరా హాస్పిటల్ ప్రాంతానికి ఐదేళ్ల చిన్నారి ఎల్‌కేజీ చదువుతోంది. కొద్ది రోజులుగా ఆ చిన్నారి స్కూల్‌కు వెళ్లనని మారం చేస్తోంది. చిట్టినగర్‌లోని నగరాల కళ్యాణ మండపం సమీపంలో ఉన్న స్మార్ట్ క్యాంపస్‌కు ఆ చిన్నారిని తల్లిదండ్రులు సోమవారం తీసుకువెళ్లి ఆయాకు అప్పగించారు. అప్పటికే ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండటంతో పాపను ఆయా కొట్టింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీచర్ కూడా ఆ పాపను కర్రతో తీవ్రంగా కొట్టింది. పాప వంటిపై వాతలు తేలాయి. సాయంత్రం షాపు నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప వీపుపై చేతి అచ్చు కనిపించడం, తలపై గాయం, చేతులపైన కమిలిన గాయాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే స్కూల్ నిర్వాహకులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం చిన్నారిని తీసు కుని స్కూల్‌కు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు ఆయా, టీచర్‌లను నిలదీశారు. ఈ క్రమంలో చిన్నారి బంధువులు స్కూల్ ఆయాపై చేయి చేసుకు న్నట్లు తెలిసింది. చిన్నారిని గాయపరిచిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొత్తపేట సీఐ చిన్న కొండలరావును వివరణ కోరగా.. ఆ ఘటనపై ఫిర్యాదు అందలేదన్నారు.
చిన్నారి తల, చేతిపై గాయాలు
చిన్నారిని చితకబాదిన టీచర్, ఆయా


