ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం భూమాత పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడు తున్న 100 గ్రామ పంచాయతీలను గుర్తించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీసీఓ చంద్రశేఖరరెడ్డి, డీపీఎం కె.పార్థసారథి, మార్క్ ఫెడ్ డీఎం మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ ఎన్ మణిధర్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి సీజన్‌లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఈ నెల ఏడు నుంచి 20వ తేదీ వరకు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ కల్పించినట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ సోమవారం ఒక ప్రకటకలో తెలిపారు. గూడూరు – సికింద్రాబాద్ (12709), కాకినాడపోర్టు–లింగంపల్లి (12737), తిరుపతి – సికింద్రాబాద్ (12763), కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775), విశాఖపట్నం – సికింద్రాబాద్ (12739), సికింద్రాబాద్ – భువనేశ్వర్ న్యూ (17016), హైదరాబాద్ – విశాఖపట్నం (12728), లింగంపల్లి – కాకినాడ టౌన్ (12776), సికింద్రాబాద్– విశాఖపట్నం (127 40), లింగంపల్లి – కాకినాడ పోర్టు (12738), సికింద్రాబాద్ – గూడూరు (12710) రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): వివిధ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఆయా కులాల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏపీ బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొ రేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మన్ శ్రీధర్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె తొలుత వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ పథకాన్ని ప్రారంభించి ఆధునిక పరికరాలను అందిస్తామని తెలిపారు. మత్స్యకా రుల వేట విరామ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు, ప్రమాద బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. బెస్త కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టిన బొమ్మన్ శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యటించి బెస్త సామాజికవర్గం సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లుగా పవన్ కుమార్, శ్రీనివాసులు, మల్లికార్జున, మనోహర్, చంద్రశేఖర్, కె. భాస్కరరావు, కె.శ్రీధర్, ఎం.వెంకట సుబ్బయ్య, పి.అమరావతి, పి.తిరుమగళ్, పళని బొమ్మన్, రామాంజనేయులు, సీహెచ్ సోమయ్య, టి.జి.రమేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ, మత్స్యకార, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ల చైర్మన్లు కొల్లు పెద్ది రాజు, చిలకల పూడి పాపారావు తదితరులు పాల్గొన్నారు.


