సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకపోయినా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని మండిపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యాన సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు జరిగే ఈ దీక్షల్లో తొలి రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు బొలినేని రఘురాం, టి.వెంకటరామయ్య మాట్లాడుతూ.. తక్షణమే జీఓ 36ను అమలు చేయాలని, డీఎల్‌ఎస్‌ఎఫ్ ఏర్పాటు చేసి జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019, 2024 పీఆర్సీలు అమలు కాలేదని, తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని, రిటైర్‌మెంట్ వయసు పెంపు, రూ. 5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా స్పందన లేకపోవడంతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. రిలే నిరాహార దీక్షలో ఎం.వెంకటేశ్వరరావు, ఎస్.ఖాజా మొహిద్దీన్, పి.సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు


