వైభవంగా శ్రీతిరుపతమ్మ రంగుల మహోత్సవం
పెనుగంచిప్రోలు: ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వ హించే పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మ వారి రంగుల మహోత్సవం సోమవారం అంగ రంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.11 గంటలకు వేద పండితులు, ఆలయ అర్చకుల మంత్రోచ్చరణ మధ్య మహా నివేదన అనంతరం శ్రీగోపయ్యసమేత శ్రీతిరుపతమ్మ విగ్రహాలు, అమ్మ, స్వామివారి ఉత్సవమూర్తులు, సహదేవతలైన మల్లమ్మ, చంద్రయ్య, అంకమ్మ, పెద్దమ్మ, మద్దిరావమ్మ, ఉన్నవూరు అంకమ్మ, గుర్రం వాహనాలను ఆలయం నుంచి ఈఓ బి. మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, అధికారుల సమక్షంలో ఆలయం నుంచి వెలుపలకు తీసుకొచ్చారు. అనంతరం విగ్రహా లను సేవకులు(రజకులు)తలపై పెట్టుకొని గ్రామ వీధుల్లో మేళతాళాలు, డప్పు వాయుద్యాలు, కోలాట నృత్యాలతో ఊరేగించారు. బేతాళ నృత్యాలు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, తెలంగాణకు చెందిన కొమ్ములవారి నృత్యాలతో పాటు కోలాట నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్ వద్ద నందిగామ ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఎం.ఎస్.కె.అర్జున్ అమ్మ వార్ల విగ్రహాలకు స్వాగతం పలికి నీళ్లు వారు పోశారు. విగ్రహాలను తలపై మోసిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రానికి విగ్రహాలు రంగుల మండపం వద్దకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేడీఈసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆలయ ఈఈ ఎల్.రమా, ఏఈ రాజు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఆలయ మాజీ చైర్మన్లు కాకాని శ్రీనివాసరావు, వాసిరెడ్డి బెనర్జీ, నూతలపాటి చెన్నకేశవరావు, లగడపాటి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


