సాగర్ కాలువలో పడి వృద్ధుడి మృతి
తిరువూరు: స్థానిక 9వ వార్డుకు చెందిన బాణావతు మణిరాం (68) ప్రమాదవశాత్తూ ఎన్‌ఎస్‌పీ తిరువూరు మేజరు కాలువలో పడి ఆదివారం రాత్రి మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణిరాం మూర్ఛ వ్యాధిగ్రస్తుడై ఇంటివద్దే ఉంటున్నాడు. అతని భార్య మంగమ్మ టౌన్‌షిప్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. వీరికి సంతానం లేదు. ఆదివారం భార్య పనిచేస్తున్న స్కూలు వద్దకు వెళుతూ ఫిట్స్ వచ్చి మేజరు కాలువలో పడి ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. మణిరాం మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి వెలికితీశారు.
గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గంధం విజయభాస్కరరావు(55), బసవ నాగమహాలక్ష్మి దంపతులకు టిడ్కో కాలనీలో సీ–76 ఎస్–4లో సొంత ప్లాటు కలిగి ఉన్నారు. అయితే గతకొంతకాలంగా ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. విజయభాస్కరరావు మద్యానికి బానిసై తరచూ చనిపోతానంటూ భార్యను బెదిరించేవాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు టిడ్కో కాలనీలో ఉన్న సొంత ప్లాటుకు వెళ్లి కుమార్తెకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. మద్యం తాగి గతంలో కూడా ఇలా మూడు, నాలుగుసార్లు చెప్పి ఉండటంతో అలా ఏమి జరగదనే అభిప్రాయంతో కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఉరికి వేలాడుతూ..
సోమవారం మధ్యాహ్నం అయినా ఇంటికి కుమార్తె టిడ్కో కాలనీలోని ప్లాటుకు వెళ్లి చూడగా తండ్రి విజయభాస్కరరావు ఉరివేసుకుని వేలాడుతున్నట్లు కన్పించాడు. ఈ క్రమంలో కుమార్తె, స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలుపగా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహాలయ్యాయి. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట కుమ్మరి వీధి 5వ లైన్‌లో బొట్టా రాజేంద్రకుమార్ తన భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అదే భవనంలో కింది అంతస్తులో రాజేంద్రకుమార్ తమ్ముడు నాగేంద్ర తేజత్‌కుమార్ తన భార్య శైలజకుమారితో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా రాజేంద్రకుమార్‌కు తన భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పిల్లలను తీసుకుని కృష్ణలంకలోని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం రాజేంద్రకుమార్ ఇంట్లో ఉండగా, తమ్ముడు నాగేంద్ర భోజనం తీసుకుని గదికి వెళ్లాడు. అయితే ఇంటి తలుపులు వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా, రాజేంద్రకుమార్ వేలాడుతూ కనిపించాడు. దీంతో నాగేంద్ర చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలకు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉయ్యాల కట్టే ప్లాస్టిక్ తాడుతో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉరి వేసుకుని మార్బుల్ కార్మికుడి ఆత్మహత్య
మద్యానికి బానిసైన మార్బుల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోతిన అప్పలస్వామి వారి వీధిలో రాంపిళ్ల శ్రీలక్ష్మి, బాబి దంపతులు నివాసం ఉంటున్నారు. బాజీ మార్బుల్ పని చేస్తుంటాడు. గత కొంత కాలంగా మద్యం అతిగా తాగడమే కాకుండా భార్యను వేదింపులకు గురి చేయసాగాడు. 15 రోజుల కిందట బాగా మద్యం తాగి వచ్చిన బాబి భార్యను, తల్లిని వేదించడంతో వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చుట్టు పక్కల వారు శ్రీలక్ష్మికి ఫోన్ నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు బాబి ఉరి వేసుకుని శవమై కనిపించాడు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


