సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో వచ్చిన ప్రతి అర్జీపై విచారణ జరిపించి బాధితులకు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల సమస్యలను సావదానంగా ఆలకించి పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే న్యాయం కోసం వచ్చే బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో 30 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● పెనమలూరుకు చెందిన సావిత్రి అనే బాధితురాలు ఎస్పీని కలిసి ఐదేళ్ల కిందట తనకు వివాహం కాగా బాబు, పాప ఉన్నారని తెలిపారు. అయితే అత్తింటివారు అదనపు కట్నం కోసం తనను మానసికంగా వేధిస్తున్నారని, తన భర్తకు మరో వివాహం చేసేందుకు సైతం పూనుకుంటున్నట్లు వివరించారు. వ్యసనాలకు బానిసైన భర్త తనపై భౌతికదాడికి పాల్పడుతూ హింసలు పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.
● బంటుమిల్లికి చెందిన ప్రసాద్ అనే రైతు ఎస్పీని కలిసి తన పొలం సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్లనీయకుండా ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపారు. అదేమంటే బెదిరింపులకు పాల్పడుతూ దాడికి తెగబడుతున్నాడని వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
● అవనిగడ్డకు చెందిన నరసయ్య వ్యవసాయ పనుల కోసం బంధువుల వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నానని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అధిక వడ్డీ పేరుతో మరింత కట్టాలని వేధిస్తున్నాడంటూ వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు


