ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో చేపట్టిన జాతీయ ఆందోళనలో భాగంగా ఈ ధర్నాను నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆలిండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. చంద్రశేఖర్ మాట్లాడుతూ 12వ ద్వైపాక్షిక ఒప్పందం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం నేటి వరకు అమలు కాలేదన్నారు. ఇంతకన్నా దురదృష్టకరమైన విషయం మరొకటి లేదన్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే బ్యాంకుల్లో ఐదు రోజుల పనిదినాలు ప్రవేశపెడుతున్నామని ప్రకటించి మాట తప్పిందన్నారు. ఇప్పటికే ఎల్‌ఐసీ, జీఐసీ, ఆర్బీఐలో ఐదు రోజుల పని దినాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో మాత్రం అమలు చేయలేకపోవడం ఎంతో దురదృష్టకరమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయ శేఖర్, నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
సంగీత సేవతో జీవితం సార్థకం
విజయవాడ కల్చరల్: సంగీత సద్గురువుల సేవలో జీవితాలను సార్థకం చేసుకోవాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. సంగీత సన్మండలి ఆధ్వర్యంలో 31వ త్యాగరాజస్వామి ఆరాధన, సంగీతోత్సవాలు జీవీఆర్ సంగీత కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలను ప్రారంభించిన గంగరాజు మాట్లాడుతూ తెలుగు వాడైన త్యాగరాజస్వామి సంకీర్తనలకు తమిళ నాట గుడికట్టారన్నారు. కళాకారులు కోసమే జీవీఆర్ కళాశాలలో వేదిక నిర్మించామన్నారు. వేదిక నిర్మాణానికి గతంలోనే కొంతమంది రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టించినట్లు తెలిపారు. సంగీత సన్మండలి అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ సభకు అధ్యక్షత వహించారు. సంగీత విద్వాంసుడు మల్లాది శ్రీరాం ప్రసాద్ త్యాగరాజస్వామి సంకీర్తనలలోని భక్తితత్వం, సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి, సంస్థ ఉపాధ్యక్షుడు జొన్నవిత్తుల ప్రభాకర శాస్త్రి, సంగీత విధూషీమణి అంజనా సుధాకర్ పాల్గొన్నారు. సంగీత కార్యక్రమంలో భాగంగా ఎస్. సాత్విక, మల్లాది సోదరీమణులు, బెంగళూరు చెందిన అలేఖ్య, హైదరాబాద్‌కు చెందిన డీవీ మోహన కృష్ణ త్యాగరాజ స్వామి కృతులను ఆలపించారు.


