కోడి పందేలు నిర్వహిస్తే కేసులు తప్పవు
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కోడి పందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా నిర్వహిస్తే కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడిపందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ఎక్కడైనా కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తుంటే సమాచారం అందించాలన్నారు. ముందుగానే కోడిపందేలు నిర్వహించే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఎఫ్‌వో సునీత, డీఈవో సుబ్బారావు, డీఎస్పీ సీహెచ్ రాజా, ఆర్టీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న యద్దల నవీన్‌కృష్ణ తరఫున న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి ఏసీబీ న్యాయస్థానంలో మధ్యంతర బెయిల్ దాఖలు చేశారు. నవీన్‌కృష్ణ భార్య గర్భవతిగా ఉండటంతో ఆమెను చూసుకునేందుకు అందుబాటులో ఉండటానికి నెలరోజులపాటు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌కు నోటీసు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అనిల్ చోక్రాకు ఆస్తమా ఉందని, ప్రస్తుతం చలికాలం కావడంతో వేడినీటిని తాగేందుకు జైలులో అనుమతించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిట్టల శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటీషన్‌పై జైలర్‌కు ప్రాసిక్యూషన్‌కు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.


