‘దేశం’ తమ్ముళ్ల కుమ్ములాట
గుడివాడరూరల్: పాత కక్షల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని లింగవరం గ్రామ పంచాయతీ చేపల చెరువులను గతంలో వేలం పాట దక్కించుకున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుపై గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిని స్థానికులు అడ్డుకుని గాయపడిన శ్రీనివాసరావును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఫిర్యాదు చేశానని కక్ష..
వైద్య చికిత్స అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ లింగవరం గ్రామంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేశానని, దీన్ని మనసులో పెట్టుకున్న గ్రామంలోని టీడీపీ నాయకులుగా చెలామణి అవుతున్న చిరంజీవిరెడ్డి, మందపాలి గోపాలస్వామి, మందపాటి శివయ్య.. తాను హార్ట్ పెషేంట్‌ని అని కూడా చూడకుండా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శ్రీనివాసరావు చెప్పారు. కాగా ఘర్షణ సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఎన్.చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధి చెప్పారు.


