పేదల బియ్యంతో..
కృష్ణాజిల్లాలో 5,26,798 రేషన్ కార్డులు ఉండగా, ప్రతినెలా 7,320.484 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 5,90,253 రేషన్ కార్డులుండగా, 8,384.607 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
ప్రతినెలా 1వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య రేషన్ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది.
వయోవృద్ధులకు ఒకటో తేదీ లోపే నాలుగు రోజుల ముందే ఇళ్లకు వచ్చి సరుకులు ఇవ్వాలి.
నెలకు రూ.10 కోట్లపైగా దండుకొంటున్న వైనం ప్రతి నియోజకవర్గం నుంచీ 500 టన్నులకు పైగా బియ్యం పక్కదారి రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలింపు బియ్యం ఇవ్వని డీలర్లకు తనిఖీల పేరుతో వేధింపులు చేసేదంతా అధికార పార్టీ నేతలే!
తెల్లవారు జామునే ఎక్కువ..
సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతం అడ్డాగా..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదల బియ్యాన్ని బొక్కేస్తున్నారు. చౌక ధరల దుకాణాలు కేంద్రంగా భారీగా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. లబ్ధిదారుడికి పదో పరకో ఆశచూపి.. రూ.కోట్లు దండుకుంటున్నారు. రేషన్ షాపులకు వెళ్లిన వారికి డీలర్ల ద్వారా నగదు బదిలీ చేసి, ఆ బియ్యాన్ని దర్జాగా షాపుల్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు. తనిఖీలు చేయాల్సిన పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఎస్‌డీటీలు, ఆర్‌ఐలు ఏళ్ల తరబడి తిష్ట వేసి, రేషన్ మాఫియాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కూడా నెలవారీ మామూళ్లు పెట్టుకొని, దందాకు పచ్చ జెండా ఊపుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికార పార్టీ నేతలే రేషన్ మాఫియాకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ వాహనాలు ద్వారా అక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రచారం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం చాలాచోట్ల సంచులు విప్పకుండానే బియ్యాన్ని తరలించేస్తున్నా చోద్యం చూస్తోంది.
నెలకు పది కోట్లకు పైనే సంపాదన..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తీసుకుని వినియోగిస్తున్నారు. నియోజకవర్గానికి నెలకు 500 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ చేసి, కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. మిగిలిన వారంతా డీలర్ల ద్వారా దళారులే అక్రమ రవాణా చేస్తున్నారు. లబ్ధిదారుడు నుంచి కిలో రూ.10 నుంచి రూ.14కు డీలర్ల నుంచి దళారులు కొనుగోలు చేస్తారు. అక్కడ నుంచి దళారులు ప్రధాన మాఫియా నేతలకు కిలో రూ.20 నుంచి రూ.24కు అమ్ముతారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేయించి కిలో రూ.50 నుంచి రూ.60కి కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కొన్నిచోట్ల అయితే సంచులు కూడా మార్చకుండా నేరుగా ఈ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. వీటి ద్వారా జిల్లాలో రేషన్ మాఫియా ప్రతి నెలా రూ.10కోట్లకు పైగా సంపాదిస్తున్నట్టు సమాచారం.
నెలకు రూ.35 లక్షలు..
రేషన్ బియ్యం అక్రమ రవాణాని చూసీ చూడనట్టు వదిలేస్తున్నందుకు ప్రతినెలా నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు రూ.35 లక్షలు, పోలీసులకు ప్రతి నియోజకవర్గం నుంచి నెలకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు రేషన్ మాఫియా ముట్ట చెబుతున్నట్టు తెలిసింది. కొంతమంది డీలర్లు తాము అడిగినంత బియ్యం ఇవ్వకపోతే విజిలెన్స్ అధికారులతో లేదంటే స్థానిక అధికారులతో తనిఖీలు చేయించి బెదిరించి తమ దారికి తెచ్చుకుంటారు. అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం రవాణా చేస్తుండటంతో పోలీసులు, ఇతర అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి.
ప్రతి నియోజకవర్గంలోనూ ఏజెంట్లు..
ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ బియ్యం రవాణా కోసం పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి అన్ని మండలాల్లో అధికార పార్టీ నేతలతో అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. పార్లమెంటు ప్రజా ప్రతినిధికే ఏకంగా నెలకు రూ.కోటికి పైగా ముడుపులు ముట్ట జెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న తన ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని విస్సన్నపేటకు తరలించి అక్కడ నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది.
తెల్లవారుజామున రెండు గంటల నుంచి 5 గంటల మధ్య ఎక్కువగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ముందుగా ఒకరు మోటార్ సైకిల్‌పై వచ్చి ట్రయల్ వేస్తారు. తమకు అనుకూలమైన పోలీసులు ఉంటే దగ్గరలో లోడు చేసుకుని రెడీగా ఉన్న వాహన డ్రైవర్‌కు రమ్మని సమాచారం ఇస్తారు. ఈ వాహనానికి ముందు గానీ, వెనుక గానీ మాఫియా నేతలు మరో వాహనంలో వెళతారు. ప్రతిరోజూ ఒకే రూటులో కాకుండా రూట్లు మార్చి అక్రమ రవాణా చేస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి కూలీ డబ్బులిచ్చి ద్విచక్ర వాహనాలపై తమకు కావాల్సి ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు.
విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రు ప్రాంతాల నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా కాకినాడ ఓడరేవుకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుసార్లు పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ జరిపిన దాడుల్లో 200 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. ఏదో పట్టుకున్నట్టు చూపించాలని అనే ఉద్దేశంతో గుర్తొచ్చినపుడల్లా దాడులు చేస్తుంటారని, ఇవి కాకుండా రోజుకి టన్నుల కొద్దీ అక్రమ బియ్యం తరలి పోతూనే ఉంటుందని కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక్కడ కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం మాఫియాకు పామర్రుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు నడిపిస్తున్నట్టు సమాచారం. ఎవరైనా అధికారులు తనిఖీలకు వెళుతుంటే ముందుగానే వారికి సమాచారం ఇచ్చి ఆ ప్రాంతం నుంచి వాటిని మార్చేస్తుంటారు.
పేదల బియ్యంతో..
పేదల బియ్యంతో..
పేదల బియ్యంతో..


