పూర్ణాహుతితో ముగిసిన ఆరుద్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ నటరాజ స్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆరుద్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం హోమగుండం వద్ద పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్‌డీ ప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు జరిపించిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మూలమంత్ర హవనం, మంటప పూజలను ఆలయ అర్చకులు జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. సాయంత్రం శ్రీశివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారికి నగరోత్సవ సేవ కనుల పండువగా సాగింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై ఉత్సవ మూర్తులు నగర పురవీధుల్లో విహరించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఓపెన్ కేటగిరీలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో ఆడేందుకు క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలోని క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో ఎంపికలు జరుగుతాయని వివరించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫొటోలు–2, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో ఆ రోజు ఉదయం 8గంటలకు కాకినాడ క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలోని ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్.వెంకటరమణను సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆరుద్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి నుంచి శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారికి నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శివకామ సుందరీ సమేత నటరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉండగా, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, చైర్మన్‌లు కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల కోలాట నృత్యాలతో ఊరేగింపు కనకదుర్గనగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, దుర్గగుడి టోల్‌గేట్ మీదగా ఆలయానికి చేరుకుంది.
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. ఉదయం తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మంగళగిరి టౌన్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్ బీర్ గోకుల్ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
పూర్ణాహుతితో ముగిసిన ఆరుద్రోత్సవాలు


