నాట్య సౌరభం.. సంక్రాంతి సంబరం
విజయవాడ కల్చరల్: జేఎంఎస్ యోగభారతి అకాడమీ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో స్థానిక కేబీఎన్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు–2026 తెలుగు సంప్రదాయ సౌరభాన్ని చాటింది. నేటి యువతకు సంక్రాంతి పండుగలోని పరమార్థం వివరించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నాట్యాచార్యులు జంగం విజయకుమార్, నిర్వాహకుడు శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. జంగం స్టిస్టర్స్ మనీషా చక్రవర్తి, శ్రీనివాస చక్రవర్తి పర్యవేక్షణలో 90 పైగా చిన్నారులు నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారక ముందే రైతులు పొలాలకు వెళ్లడం, ఇంటి ముందు గొబ్బెమ్మలు, పల్లె జీవన సౌందర్యం, హరిదాసులు, గంగి రెద్దులు, పిట్టల దొరలు, చెక్కభజనలు, బుర్రకథలు, కోలాటం తదితర అంశాలతో కూడిన నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు, కళాశాల ప్రిన్సిపాల్ జి. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. రెండుగంటలపాటు సాగిన నృత్య కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.


