బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బీసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి విద్యే కీలకమని, ఆ దిశగా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్‌తోపాటు బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునికీకరణ ద్వారా కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు.
ఆ ఘనత ఎన్టీఆర్‌దే..
మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారు అన్ని విధాలా ఎదిగేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులని, వారి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం మాట్లాడుతూ బీసీలకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రిమిలేయర్ తొలగింపు, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలని కోరారు. బీసీ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శి ఎస్.సత్యనారాయణ, బీసీ, ఓబీసీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి.కేదారేశ్వరరావు, జనరల్ సెక్రటరీలు పి.శ్రీధర్, పి.భూషణ్‌రావు, ట్రెజరర్ వై.శంకరరావు, 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.


